కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, కనీస వేతనాన్నిఅమలు చేస్తామని, అసంఘటిత రంగంలోనూ అపాయింట్‌మెంట్ లెటర్స్,హెల్త్ చెకప్స్ ఉండేలా చేస్తామని చెప్తూనే కార్మిక చట్టాల సవరణలు, రద్దు వంటి చర్యలు చేపట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుండటం గమనార్హం. మొదట ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఆ తర్వాత గుజరాత్ కూడా అదే బాటలో పయనించింది. అసోం సైతం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు కూడా కార్మిక చట్టాల్లో సడలింపుల గురించి సమాలోచనలు జరుపుతున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలు చాలావరకు కార్మిక చట్టాలను రద్దు చేశాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులకు కావాల్సిన మౌలిక సదుపాయాల దగ్గరి నుంచి మొదలు ఉద్యోగపరంగా పొందే అన్ని బెనిఫిట్స్‌లోనూ యాజమాన్యాలకే పూర్తి స్వేచ్చనిచ్చాయి. అంటే,యజమాని కార్మికుల పట్ల దయ తలిస్తేనే పని ప్రదేశంలో వారికి మంచి నీళ్లు,శుభ్రమైన టాయిలెట్స్,8గంటల పని,క్రమం తప్పకుండా వేతనం,హెల్త్ చెకప్‌లు వంటి సదుపాయాలు అందుతాయి. లేదంటే దేనికీ భరోసా లేదు. 12 గంటలు పనిచేయించుకోవడానికి ఫ్యాక్టరీలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. ఓవర్ టైమ్ 76 గంటల పాటు పనిచేయించకోవచ్చు. ఉద్యోగులను తమ ఇష్టానుసారం తీసేయవచ్చు,లేదా నియమించుకోవచ్చు. దీనిఫై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో 100 మంది వరకు కార్మికులను ఒకేసారి తొలగిస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు. పరిశ్రమ యాజమాన్యాలదే అంతిమ నిర్ణయం. వాళ్ల దయా దాక్షిణ్యాల పైనే కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆఖరికి ఫ్యాక్టరీల్లో భద్రత ప్రమాణాల తనిఖీకి కూడా నీళ్లు వదిలారు. ఇకపై ఆ సర్టిఫికేషన్‌ను థర్డ్ పార్టీకి అప్పగించారు.
ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పూర్తిగా ఎత్తివేస్తే ఆటవికత రాజ్యమేలుతుందని,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దూరమయ్యేందుకు ఇది కూడా కారణమవుతుందాని నల్సార్ యూనివర్సిటీకి చెందిన అమీర్ ఉల్లాఖాన్ అనే ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో సంఘటిత రంగం కేవలం 10శాతం మాత్రమే. అసంఘటిత రంగంలో దాదాపు 90శాతం మంది ఉద్యోగ,ఉపాధి పొందుతున్నారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10శాతం మంది కార్మికుల భద్రత కోసం ఉన్న చట్టాలనే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నప్పుడు.. ఇక అసంఘటిత రంగంలో కార్మికుల భద్రతకు కేంద్రం ఇస్తున్న హామీలు అమలవుతాయా? . కోవిడ్-19 లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పని ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్,పరిశుభ్రత చాలా ముఖ్యమని, తక్కువ ఉద్యోగులతో పనులు చేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కానీ ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ వంటి రాష్ట్రాలు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయాన్ని పరిశ్రమల యాజమాన్యానికే వదిలిపెడుతున్నాయి. అసలే కరోనా కాలం.. పరిశ్రమల్లో శుభ్రమైన తాగునీరు అందించకపోతే,శుభ్రమైన టాయిలెట్స్ లేకపోతే,పని ప్రదేశాలను శానిటైజ్ చేయకపోతే,8గంటలకు బదులు 12గంటలు పనిచేయిస్తే.. కార్మికుల ఆరోగ్యం ఏమైపోవాలి.
ఈ చర్యల కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెప్పడం కూడా ఆశ్చర్యంగా ఉందని.. ఒకవేళ అదే నిజమై ఎక్కువమందికి ఉద్యోగాలు దొరికితే.. 12 గంటల పని విధానానికి బదులు.. తక్కువ పని గంటలతో ఎక్కువ షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగించాలి కదా అని అమీర్ ఉల్లాఖాన్ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.